Old Testament

పాత నిబంధన

పాత నిబంధన (యూదు లేఖనాలు) బైబిల్లో ప్రథమ భాగం తొలి క్రైస్తవులు ఉదాహరించిన లేఖనాలు కూడా ఇవే. క్రీస్తు శకం మొదటి రెండు శతాబ్దాల్లో క్రొత్త నిబంధనలోని గ్రంథాలకు లేఖన ప్రతిపత్తి లభించిన తర్వాతనే యూదు లేఖనాలను పాత నిబంధన అనడం ప్రారంభమైంది. వాస్తవానికి పాత నిబంధన గ్రంథం సుమారు వెయ్యేళ్ల కాలంలో వివిధ వ్యక్తులు వ్రాసిన వివిధ రచనల సంకలనం. పాతనిబంధనలోని కొన్ని రచనలు క్రీస్తుపూర్వం 1200 నాటికి చెందినవి. పాత నిబంధన రచనల్లో కొన్ని వాస్తవానికి తరతరాలుగా వచ్చినా పారంపర్య గాథలే. ఈ గాధల్నే సేకరించి గ్రంథస్తం చేయడం జరిగింది. పాతనిబంధనలోని చాలా భాగాన్ని హెబ్రీ భాషలో వ్రాశారు. ఇశ్రాయేలీయుల భాష హెబ్రీ భాష.

పాత నిబంధనలోని సూచకక్రియలు

ఆదికాండము - Genesis

పరిచయం:

"ఆది" అనే పదానికి 'మూలం',లేక 'మొదలు' అని అర్థం. ఈ పుస్తకం విశ్వసృష్టి గురించి మానవజాతి ఆరంభం గురించి లోకంలో పాపం శ్రమ మొదలు కావడం గురించి వివరిస్తోంది. ఇంకా ఈ పుస్తకం దేవుడు మానవులతో ఎలా ప్రవర్తించాడో వివరిస్తోంది.

నిర్గమకాండము - Exodus

పరిచయం:​

'బయలుదేరడం' అనే అర్థాన్నిచ్చే ఈ పుస్తకం ఇశ్రాయేలు చరిత్రలోని ప్రముఖ సంఘటనలను తెలియజేస్తోంది. ఈ సంఘటనలు: ఐగుప్తులో దాసులుగా ఉన్నా హెబ్రీయులు అక్కడనుండి బయలుదేరడం, సీనాయి పర్వతానికి ప్రయాణం, మరియు దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధన.

లేవీయకాండము - Leviticus

పరిచయం:

ఈ పుస్తకం పురాతన కాలంలో ఇశ్రాయేలీయులు ఆచరించిన ఆరాధన నియమాల గురించి మతపరమైన పండుగల గురించి మరియు వీటిని నిర్వహించవలసిన యాజకుల విధుల గురించి వివరిస్తోంది.

సంఖ్యాకాండము - Numbers

పరిచయం:

సంఖ్యాకాండము ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతాన్ని విడిచిపెట్టిననాటినుండి దేవుడు వారికి వాగ్దానము చేసిన దేశపు తూర్పు సరిహద్దు సమీపించే నాటి వరకు నలబై సంవత్సరాల చరిత్రను వివరిస్తోంది. సంఖ్యా కాండం అనే పేరు ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీయులు సినాయి పర్వతాన్ని విడిచిపెట్టేముందు, మళ్లీ ఒక తరం గడిచిన తరువాత యోర్దాను తూర్పున మోయాబు మైదానంలో మోషే ఇశ్రాయేలీయుల సంఖ్యను లెక్కించడాన్ని సూచిస్తోంది.

ద్వితీయోపదేశకాండము - Deuteronomy

పరిచయం:

ఇశ్రాయేలీయులు తమ సుదీర్ఘ ప్రయాణం ముగింపులో మోయాబు మైదానంలో ఉన్నప్పుడు, అంటే కానానులో ప్రవేశించబోయే ముందు మోషే వారితో చెప్పిన ఉపదేశాల అనుక్రమణిక గ్రంథం.మోషే వారికి నలభై సంవత్సరాల చరిత్రను జ్ఞాపకం చేయడాన్ని ఈ గ్రంథం ప్రాముఖ్యంగా వివరిస్తోంది.

యెహోషువ - Joshua

పరిచయం:

యెహోషువా గ్రంథం ఇశ్రాయేలీయులు మోషే తర్వాత తమ నాయకుడైన యెహోషువ నేతృత్వంలో కనాను స్వాధీనపర్చుకోవడం గురించి వివరిస్తోంది. ఈ గ్రంథంలోని ప్రముఖ సంఘటనలు: యోర్దాను దాటడం యెరికో పతనం, హాయి యుద్ధం,మరియు నిబంధన పునరుద్ధరణ.

న్యాయాధిపతులు - Judges

పరిచయం:

న్యాయాధిపతులు గ్రంథం ఇశ్రాయేలు చరిత్రలో కనాను స్వాధీనం తర్వాత రాచరికానికి ముందు నెలకొనిన అవ్యవస్థను వివరించే కథల సమాహారం. న్యాయాధిపతులని పేరుపొందిన ఇశ్రాయేలు వీరుల విజయాలే ఈ కథలు.వీరిలో అనేకులను న్యాయాధిపతులనడం కంటే యుద్ధాలను నడిపించిన నాయకులనడం సబబు.

రూతు - Ruth

పరిచయం:

న్యాయాధిపతులు గ్రంథంలో ప్రస్తావించిన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో నడిచిన కథ రూతు గ్రంథం. మోయాబీయులురాలైన రూటు ఇశ్రాయేలీయుణ్ణి వివాహం చేసుకుంటుంది.రూతు తన భర్త మరణించిన తర్వాత ఇశ్రాయేలుయురాలైన తన అత్త నయోమిపట్ల అపూర్వమైన విధేయతను ఇశ్రాయేలు దేవునిపట్ల ప్రగాఢమైన భక్తిని ప్రదర్శించింది. తుదకు రూతు తన భర్త బంధువును వివాహం చేసుకొంది.ఇశ్రాయేలులో ఘనత వహించిన రాజు దావీదుకు రూతు మూత్తవ్వ.

1 సమూయేలు - 1 Samuel

పరిచయం:

ఇశ్రాయేలు చరిత్ర లో న్యాయాధిపతుల తరువాత రాచరికానికి ముందున్న సంధికాలంనాటి సంఘటనలను మొదటి సమూయేలు గ్రంథం వివరిస్తోంది. ఈ గ్రంథంలో ప్రముఖులు: చివరి న్యాయాధిపతి సమూయేలు, ఇశ్రాయేలు మొదటి రాజు సౌలు, మరియు దావీదు అంతేకాదు దావీదు. దావీదు రాజు కావడానికి పూర్వం అతని సాహసకార్యాలు సమూయేలు సౌలుల వృత్తాంతాల నడుమ కనిపిస్తాయి. పాత నిబంధనలోని ఇతర చారిత్రక కథనాలాగానే ఈ గ్రంథం కూడ దేవునిపట్ల విధేయత విజయానికి నడిపిస్తుందని, అవిధేయత అనర్ధాలకు నడిపిస్తుందని వివరిస్తోంది.

2 సమూయేలు - 2 Samuel

పరిచయం:

మొదటి సమూయేలు గ్రంథానికి తరువాత భాగమైన రెండోవ సమూయేలు గ్రంథం దావీదు రాజు పాలన గురించి తెలియ జేస్తోంది. దావీదు తొలుత దక్షిణంలోని యుదాకు (1-4 అధ్యాయాలు ), తర్వాత ఉత్తరంలోని ఇశ్రాయేలుతో సహా (5 -24 అధ్యాయాలు) యావత్ దేశానికి రాజుగా వున్నాడు. దావీదుకు రాజ్యవిస్తరణలోనూ, అతను రాజుగా తనను సమీకరించుకోవడంలోను, దేశం లోపల దేశం వెలుపల శత్రువుల నుండి ఎటువంటి సంఘర్షణ లేదుర య్యాయో ఈ గ్రంథం వివరిస్తోంది దేవుని పట్ల అచంచల భక్తి విశ్వాసాలను ప్రదర్శించిన దావీదు ప్రజాభిమానాన్ని పొందిన సమర్ధుడు కూడ.

1 రాజులు - 1 Kings

పరిచయం:

మొదటి రాజుల గ్రంథం సమూయేలు గ్రంథంల్లో ప్రారంభమైన ఇశ్రాయేలు రాజుల చరిత్రను కొనసాగిస్తోంది. ఈ గ్రంథంలోని మూడు ముఖ్యభాగాలు : (1) దావీదు రాజు మరణానంతరం అతని కుమారుడు ఇశ్రాయేలు యుదాలకు రాజు కావడం: (2) సొలోమోను పరిపాలన, మరియు అతని కార్యసిద్ధి - ప్రాముఖ్యంగా యెరుషలేములో దేవాలయ నిర్మాణం: (3) ఉత్తర-దక్షిణ రాజ్యాలుగా దేశవిభజన, క్రీస్తు పూర్వం తొమ్మిదవ శతాబ్దం మధ్య కాలంవరకు పరిపాలించిన రాజుల వృత్తాంతాలు. దేవునిపట్ల విధేయత చూపడం మానవద్దని, విగ్రహాలను పూజించవద్దని, ప్రకటించిన ప్రవక్తల్లో అగ్రగణ్యుడైన ఏలియా ఈ గ్రంథంలో కనిపించే మరొక ప్రముఖుడు.

2 రాజులు - 2 Kings

పరిచయం:

మొదటి రాజుల గ్రంథంలోని రెండు రాజ్యాల చరిత్రనే రెండవ రాజుల గ్రంథం కొనసాగిస్తోంది. ఈ గ్రంథంలోని రెండు ముఖ్యభాగాలు: (1) క్రీస్తు పూర్వం తొమ్మిదవ శతాబ్దం మధ్య కాలంనుండి షోమ్రోను పతనం వరకు రెండు రాజ్యాల చరిత్ర, మరియు క్రీ. పూ. 722 లో ఉత్తర రాజ్య పతనం: (2) ఇశ్రాయేలు రాజ్యపతనంనుండి క్రీ. పూ. 586లో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరుషలేమును ముట్టడించి నాశనం చేయడం వరకున్న చరిత్ర. ఏలియా ప్రవక్త తర్వా త ప్రవక్తగా ఉన్నా ఎలీషా రెండవ రాజుల గ్రంథంలో కనిపించే మరొక ప్రముఖుడు.

1 దినవృత్తాంతములు - 1 Chronicles

పరిచయం:

సమూయేలు గ్రంథలు మరియు రాజులు గ్రంథాల్లో జరిగిన సంఘటనలే మొదటి దినవృత్తాంతములు గ్రంథంలో భిన్న కోణం నుండి వివరించబడ్డాయి. ఇశ్రాయేలు మరియు యూదా రాజ్యాలకు ఎదురైనా ఆపత్కాలంలో సైతం, దేవుడు వారిపట్ల చేసిన వాగ్దానాలు నిలిచే వున్నాయని తన ప్రజల ద్వారా ఆయన తన సంకల్పం నెరవేరేలా చేస్తాడని దినవృత్తాంతములు గ్రంథాలు వివరిస్తున్నాయి.

2 దినవృత్తాంతములు - 2 Chronicles

పరిచయం:

రెండోవ దినవృత్తాంతములు గ్రంథం మొదటి దినవృత్తాంతములు గ్రంథంలోని చరిత్రనే కొనసాగిస్తోంది. సొలోమోను పరిపాలనతో ప్రారంభమైన ఈ గ్రంథం అతని మరణం గురించి, అతని కుమారుడు రాజ్యానికి వారసుడు అయిన రెహబాము గురించి,యారోబాము నాయకత్వంలో ఉత్తర గోత్రాల తిరుగుబాటు గురించి వివరిస్తోంది. అయితే ఈ గ్రంధంలో ప్రధానంగా దక్షిణరాజ్యమైన యూదా చరిత్ర కనిపిస్తోంది.

ఎజ్రా - Ezra

పరిచయం:

ఎజ్రా గ్రంథం దినవృత్తాంతములు తర్వాత జరిగిన పరిణామాలను వివరిస్తోంది. బబులోనుచెరనుండి కొందరు యూదులు తిరిగివచ్చి యెరూషలేములో ప్రజాజీవనాన్ని మరియు దైవారాధనను పునరుద్ధరించడం ఈ గ్రంథంలోని ముఖ్యాంశం.

నెహెమ్యా - Nehemiah

పరిచయం:

నెహెమ్యా గ్రంథం దేవుడే తన ఆశ్రమంటూ పట్టుదలతో ప్రార్థించిన నెహెమ్యా లక్ష్యసిద్ధి గురించి వివరిస్తోంది.

ఎస్తేరు - Esther

పరిచయం:

ఎస్తేరు గ్రంథం పారసీక చక్రవర్తి శీతాకాలపు రాజప్రాసాదంలో ఎస్తేరు అనే యూదు కథానాయకురాలు చుట్టూ పరిభ్రమించిన కథనాల సమాహారం.అసామానమైన ధైర్యసాహసాలను అచంచలమైనా దైవభక్తిని ప్రదర్శించిన ఎస్తేరు తన జాతిని శత్రుసంహారంనుండి కాపాడింది. యూదుల పండుగ పూరీము నేపథ్యాన్ని అర్థాన్ని ఈ గ్రంథం విశదీకరిస్తోంది.

యోబు - Job

పరిచయం:

సకల విపత్తులకు గురయిన నీతిమంతుడైన వ్యక్తి గాథ యోబు గ్రంథం. యథార్థ వర్తనుడైన యోబు తన సంతానాన్ని యావదాస్తిని కోల్పోయి జుగుప్సాకరమైన వ్యాధి బారిన పడతాడు. యోబు, అతని ముగ్గురు స్నేహితులు ఈ విపత్తులపట్ల చూపిన ప్రతిస్పందనను వారి మధ్య జరిగిన సంభాషణల పరంపర నో గ్రంధకర్త పద్యరూపంలో వర్ణింస్తాడు. గ్రంథం చివర్లో దేవుడు యోబుతో మానవ చరిత్ర ఏ విధంగా తన అధీనంలో ఉందో చెబూతాడు. యోబు కష్టాలు తొలగిపోయి, అతను తాను పోగొట్టుకున్నవన్ని మళ్లీ పొంది భక్తి యథార్థతలతో జీవించాలనే వర్ణనతో గ్రంథం ముగుస్తోంది.

కీర్తనల గ్రంథము - Psalms

పరిచయం:

వివిధ రచయితలు సుదీర్ఘ కాలవ్యవధిలో రచించిన స్తుతులు మరియు ప్రార్ధనల సమూహం కీర్తనలు. ఇశ్రాయేలు ఆరాధనలో ముఖ్యభామైన ఈ కీర్తనలు కాలక్రమేణా లేఖనాలు భాగమయ్యాయి. పలు ఇక్కట్లలో విభిన్న భావోద్వేగాలతో దేవుణ్ణి శరణు కోరిన సహాయాన్ని కాపుదలను రక్షణను క్షమాపణలు అర్థిస్తూ చేసిన మానవులు, దైవాశీర్వాదాలకొరకు కృతజ్ఞతాస్తుతులు, శత్రుసంహారంకోసం విన్నపాలు కాగా మరి కొన్ని జాతి యావత్తు చేసిన ప్రార్థనలు: కొన్ని కీర్తనలు మనిషి అంతరంగంలోని ఆర్ధరు తలంపులు కాగా, మరి కొన్ని దేవుని ప్రజల అవసరాలను అనుభూతులను వెల్లడించే విజ్ఞాపనలు. ఈ గ్రంథంలోని నూట యాభై కీర్తనలను అయిదు సంగ్రహాలుగా ప్రస్తావించారు.

సామెతలు - Proverbs

పరిచయం:

నీతిని ధార్మికజీవనాన్ని ప్రబోధించే పలు సామెతలు సూక్తులు సంకలనం సామెతలు గ్రంథం. దైనందిన జీవితంలో ఆచరణసాధ్యమైన వివేకాన్ని, వ్యవహార జ్ఞానాన్ని,మంచి అలవాట్లను, వినయం విధేయత క్షమా సహనం కరుణ వంటి సుగుణాలను ప్రస్తావించే ఈ సామెతలు " యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము" అనే విషయాన్ని స్మరణకు తెస్తున్నాయి..

ప్రసంగి - Ecclesiastes

పరిచయం:

మానవ జీవితం అశాశ్వతంమని మరియు పరస్పర విరుద్ధమైనదని భావిస్తూ,అది వివరించ శక్యం కాని అన్యాయంతోను నైరాశ్యంతోను నిండి వుంది గనుక "వ్యర్థము "అని క్లుప్తీకరించిన తత్వజ్ఞని తలంపులు ప్రసంగి గ్రంథం. రచయిత తలంపుల్లో నిరసన భావం వ్యాకులత కనిపిస్తున్నప్పటికీ, అతను మనుషులు భూమ్మీద కష్టపడి పని చేయాలని దేవుడిచ్చినవాటిని సమృద్దిగా అనుభవించాలని చెప్తున్నాడు.

పరమగీతము - Song of Solomon

పరిచయం:

పరమగీతాలు ప్రణయగీతాల పరంపర. ఈ గీతాల్లో కనిపించే ఇరువురు స్త్రీ పురుషుల పరస్పర సంభాషణలను యూదులు దేవునికి ఆయన ప్రజలకు మధ్యనున్న సంబంధానికి, క్రైస్తవులు క్రీస్తు పూర్వం ఆయన సంఘానికి మధ్యనున్న సంబంధానికి సాదృశ్యముగా భావిస్తారు.

యెషయా - Isaiah

పరిచయం:

యెషయా అనే ఈ గ్రంథనామం క్రీస్తుపూర్వం ఎనిమిదవ శతాబ్దపు ద్వితీయార్ధంలో ఎరుషలేము లో జీవించిన ఒక గొప్ప ప్రవక్త ను సూచిస్తోంది ఈ గ్రంథంలోని మూడు ముఖ్యభాగాలు : 1 -39 అధ్యాయాల్లో దక్షిణ రాజ్యమైన యూదాకు శత్రువైన అషురూ రాజు నుండి భయోతాప్తమైన బెదిరింపులు కనిపిస్తాయి. అయితే దీన్ని శత్రువు బలమని కాక, తన ప్రజల పాపఫలితమని అవిధేయత ఫతితమని భావించిన ప్రవక్త ప్రజలను వారి అధిపతులను నీతిన్యాయాలు కలిగివుండమని కోరుకుంటూ, దేవుని మాటలను లక్ష్యపెట్టక పోయినట్లయితే వినాశనం తప్పదని హెచ్చరిస్తూ, దావీదు వంశంలో జన్మించినబోయే రాజు విశ్వంలో శాంతిని స్థాపిస్తాడనే ఆశాభావాన్ని వెల్లడిస్తాడు. 40 -55 అధ్యాయాల్లో యూదా ప్రజలు బబులోనున చీరలో నిరాశానిస్పృహల మధ్య ఉండడం కనిపిస్తుంది. అయితే దేవుడు తన ప్రజలను చెరనుండి విడిపించి యెరుషలేముకు నడిపించి నూతన జీవితాన్నిస్తాడనే ఆశాభావాన్ని ప్రవక్త తెలియజేస్తున్నాడు. 50 -66 అధ్యాయాలు యేరుషలేముకు తిరిగి చేరుకున్న ప్రజలకు దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తాడనే నిశ్చయత నిస్తున్నాయి. నీతి న్యాయం విశ్రాంతిదినాచరణ బల్పర్పణలు ప్రార్ధన ఈ అధ్యాయాల్లో ప్రాముఖ్యంగా కనిపిస్తాయి.

యిర్మియా - Jeremiah

పరిచయం:

యిర్మియ ప్రవక్త క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దం ద్వితీయార్థంలోను ఆరవ శతాబ్దం ప్రథమార్థంలోను జీవించాడు. దేశంలో నానాటికీ అధికమా్తున్న విగ్రహారాధన పాపం వినాశనానికి నడిపిస్తుందని యిర్మియా సుదీర్ఘ కాలంగా ప్రవచించాడు. అయినా యిర్మియా మాటలను ఎవరూ లెక్కచేయలేదు. కాబట్టి అతను తన ప్రవచనాలు తన జీవితకాలంలోనే నెరవేరడం చూశాడు. బబులోను రాజైన నెబుకద్నెజరు యేరుషలేము పైకి దేవాలయంపైకి దాడి చేసి యూదా రాజును అతని ప్రజలను బబులోనుకు బందీలుగా పట్టుకుపోయాడు. యూదా ప్రజలు చెరనుండి తిరిగి వచ్చి దేశాన్ని పునరుద్ధరిస్తారు అని కూడా యిర్మియ ప్రవచించాడు.

విలాపవాక్యములు - Lamentations

పరిచయం:

క్రీస్తుపూర్వం 586 సంవత్సరంలో యేరుషలేము పతనం, వినాశనం,మరియు చెర అనంతరం ఏర్పడిన దుర్గతినిబట్టి విలపిస్తూ ఆలపించిన అయిదు పద్యాల సంకలనం విలాపవాక్యములు గ్రంథం. ఈ గ్రంథంలో విలాప గీతాలు మధ్య దేవునిలో నమ్మకం భవితవ్యంపట్ల ఆశాభావం కనిపించడం విశేషాంశం. యూదులు తమ దేశపతనాన్ని స్మరణకు తెచ్చుకుంటూ ఆచరించే ఉపవాస దినాల్లో ఈ విలాపగీతాలు ఆలపించడం పరిపాటి.

యెహెఙ్కేలు - Ezekiel

పరిచయం:

క్రీస్తు పూర్వం 586 సంవత్సరంలో యెరుషలేము పతనమైన తర్వాత యెహెజ్కేలు ప్రవక్త బబులోను చెరలో జీవించాడు. బబులోను చెరలో ఉన్న ప్రజల నుద్దేశించి, మరియు యెరుషలేములో ఉన్న శేషప్రజ నుద్దేశించి యెహెజ్కేలు ప్రవచించాడు. దర్శనాలు సాదృశ్యాలు ప్రాముఖ్యంగా కనిపించే ఈ గ్రంథంలో యెహెజ్కేలు ఎవరి పాపాలకు వారే బాధ్యులని చెప్పడం హృదయంలో నిజమైన మార్పు రావాలని నొక్కి చెప్పడం విశేషాంశాలు. ప్రవక్త మరియు యాజకుడు అయిన యెహెజ్కేలు దేవాలయంపట్ల పరిశుద్ధత పట్ల చూపిన ఆసక్తి గమనార్హం.

దానియేలు - Daniel

పరిచయం:

యూదులు బహుదేవతారాధనకుడైన శత్రురాజు ఆధీనంలో హింసలను అణిచివేతకు గురైన కాలంలో దానియేలు గ్రంథాన్ని రచించడం జరిగింది. దేవుడు శత్రురాజు నిరంకుశపాలనను అంతమొందించి తన ప్రజలకు అధికారాన్ని మళ్లీ ఇస్తాడని నిరీక్షణ మక నిరీక్షణాత్మక సందేశాలను ప్రవక్త తన దర్శనాల ద్వారా తెలియజేస్తాడు.

హోషేయ - Hosea

పరిచయం:

క్రీస్తు పూర్వం 721 సంవత్సరంలో షోమ్రోను పతనం తర్వాత కష్టకాలంలో ఆమోసు ప్రవక్త అనంతరం హోషేయ ప్రవక్త ఉత్తర రాజ్యంలో విగ్రహారాధన గురించి విశ్వాసరాహిత్యం గురించి ప్రవచించాడు.హోషేయ ప్రవక్త ఒక వ్యభిచారిణిని పెళ్లి చేసుకొని దేశప్రజల విశ్వాసరాహిత్యాన్ని సాదృశ్యరూపకంగా తెలియజేశాడు. అయితే దేవుడు తన ప్రజల పట్ల కృప చూపిస్తాడని దేశం మళ్లీ బాగుపడుతుందని ప్రవక్త ప్రకటిస్తాడు

యోవేలు - Joel

పరిచయం:

యోవేలు ప్రవక్త గురించి అంతగా వివరాలు తెలియనప్పటికీ అతను వ్రాసిన ఈ గ్రంథం క్రీస్తు పూర్వం అయిదు లేక నాలుగు శతాబ్దాల నాటి అని తెలుస్తోంది. యోవేలు అతిఘోరమైన మిడతల దండు గురించి తీవ్రరమైనా క్షామం గురించి వర్ణించాడు. ప్రజలు తమ పాపాలనుండి విముఖులై తనవైపు మళ్లాలని దేవుడు కోరుకుంటున్నాడని దేవుడు తన ప్రజలను పునరుద్ధరిస్తాడని దేవుని వాగ్దానాలు నిలిచే వున్నాయని యోవేలు వివరించాడు. దేవుడు అందరి పైన తన ఆత్మను కుమ్మరిస్తాడని యోవేలు ప్రవహించడం ఈ గ్రంథంలోని విశేషాంశం.

ఆమోసు - Amos

పరిచయం:

బైబిల్లోని ప్రవక్తల సందేశాల్లో అత్యంత వివరంగా కనిపించే సందేశం ఆమోసు ప్రవక్త సందేశమే. ఆమోసు యూదా రాజ్యానికి చెందినవాడైనప్పటికీ అతను క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దంపు మధ్య కాలంలో ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు ప్రజల నుద్దేశించి ప్రవచించాడు. ఆమోసు కాలంలో దేశం సుభిక్షంగా ఉన్నప్పటికీ దేవునిపట్ల ప్రజలు భక్తులు చూపినప్పటికీ వాస్తవానికి కొద్దిమంది ధనవంతులు మాత్రమే సుఖసంతోషాల ననుభవిస్తున్నారని ధనవంతులు పేదలకు అన్యాయం చేస్తూ వారిని దోచుకుంటున్నారని భయభక్తులు హృదయపూర్వకమైనవి కావని భద్రత నిజమైన భద్రత కాదని ప్రవక్త గమనించాడు. పరిస్థితులు ఇలాగే ఉంటే దేవుడు వారిని శిక్షిస్తాడని ప్రవక్త హృదయభారంతో పేర్కొంటూ " న్యాయము స్థిరపరచుడి " అని మనవి చేయడం ఈ గ్రంథంలో ముఖ్యాంశం.

ఓబద్యా - Obadiah

పరిచయం:

ఈ క్లుప్త గ్రంథం క్రీస్తు పూర్వం 586 వ సంవత్సరంలో యెరుషలేము పతనానంతరం కాలానికి సంబంధించినది కావచ్చు. యూదా దేశానికి చిరకాల శత్రువైన ఎదోము దేశమును యూదా దుస్థితిని చూసి సానుభూతి చూపడానికి బదులు సంతోషించి యెరుషలేమును దోచుకుని శత్రువుకు సహాయము చేసింది. ఇశ్రాయేలు శత్రుదేశాలన్నీ శిక్షకు గురైనట్లే ఎదోము కూడా శిక్షకు గురవుతుందని ఓబద్యా ప్రవచించాడు.

యోనా - Jonah

పరిచయం:

బైబిల్లోని ప్రవక్తల గ్రంథాల్లో కథా రూపంలో ఉన్న ఏకైక గ్రంథం యోనా. దేవుడు యోనాను ఇశ్రాయేలు బద్ద శత్రువైన అషురు ముఖ్యపట్టణమైన నినెవెకు వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. అయితే దేవుడు నీనెవెను శిక్షించడని ఆయన నీనెవె ప్రజలను క్షమిస్తాడు అని నమ్మిన యోనా దేవుడు తనతో చెప్పిన ప్రకారము చేయడు. కొన్ని పరిణామాల తర్వాత యోనా అయిష్టంగానే నినెవెకు వెళ్లి సందేశాన్ని ప్రకటిస్తాడు. యావత్ సృష్టిపై దేవునికున్న సంపూర్ణ అధికారం కృప ప్రేమలను ఈ గ్రంథం వివరించడం గమనార్హం.

మీకా - Micah

పరిచయం:

యెషయా ప్రవక్త సమకాలీనుడైన మీకా ప్రవక్త దక్షిణరాజ్యమైన యూదాలోని గ్రామీణప్రాంతానికి చెందినవాడు. ఉత్తర రాజ్యానికి ఆమోసు దేనినైతే ప్రవచించాడు అదే యూదాకు తప్పదని మీకా నమ్మాడు. ఎందుకంటే దేవుడు అన్యాయాన్ని సహించడు. భావికాలం గురించి నిరీక్షణాస్పదమైన మరియు స్పష్టమైన సందేశాలు ఈ గ్రంథంలో ఉండడం గమనార్హం.

నహూము - Nahum

పరిచయం:

ఇశ్రాయేలు చిలకల శత్రువైన అష్షురు aముఖ్యపట్టణమైన నినెవే పతనం గురించి నహుము ఈ గ్రంథం వ్రాశాడు. క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దం చివర్లో సంభవించిన నినెవె పతనాన్ని అహంకారంతో క్రూరంగా ప్రవర్తించిన దేశం మీదకి వచ్చిన దేవుని శిక్ష గా చెప్పవచ్చు.

హబక్కూకు - Habakkuk

పరిచయం:

క్రీస్తు పూర్వం ఏడవ శతబ్దం చివర్లో హబక్కూకు ప్రవచించాడు. శత్రువు బలాధిక్యాతతో క్రూరహింస జరిగిస్తున్నపుడు ప్రవక్త అవేదనతో దేవుణ్ణి "నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు?" అని ప్రశ్నిస్తాడు.హబక్కూకు గ్రంధంలోని మిగిలిన భాగమంతా అవినీతిమంతులమీదకి వచ్చే శిక్ష గు గురించిన ప్రవచనం. గ్రంథం చివర్లో దేవుని గొప్పతనం గురించి ప్రవక్తలోనని అచంచలమైన విశ్వాసం గురించి వర్ణన పద్యరూపంలో కనిపిస్తుంది.

జెఫన్యా - Zephaniah

పరిచయం:

క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దం ద్వితీయార్ధంలో బహుశా యేషయా రాజు సంస్కరణలకు ఒక దశాబ్దం ముందు జెఫన్యా ప్రవక్త ప్రవచించాడు.యూదా రాజ్యం నిజమైన దేవుణ్ణి విడిచి విగ్రహాలను పూజించినందుకు యూదాపైకి రాబోయే వినాశనం గురించి ప్రవచనం ఈ గ్రంథంలో కనిపిస్తుంది. యూదానే కాదు, దేవుడు ఇతర దేశాలను కూడా శిక్షిస్తాడు. యెరుషలేము శిక్షకు గురైనప్పటికీ మళ్లీ పునరుద్ధరణ కలుగుతుందనే ఆశాభావం ఈ గ్రంథంలో కనిపిస్తుంది.

హగ్గయి - Haggai

పరిచయం:

స్తు పూర్వం 520 సంవత్సరంలో హగ్గయి ప్రవక్త ద్వారా యెహోవా సెలవిచ్చిన క్లుప్త సందేశాల సంకలనం ఈ గ్రంథం. దేవుని ప్రజలు చరణ్ నుండి స్వదేశానికి తిరిగి చేరుకున్నారు. యెరుషలేములో ప్రజాజీవనం మెరుగుయ్యింది. అయితే దేవాలయం మాత్రం శిథిలాల్లోనే వుంది. దేవాలయాన్ని పునర్నిర్మించాలని, మరియు దేవుడు తన వైపు మళ్లిన ప్రజలకు సమాధానాన్ని క్షేమాన్ని ఆశీర్వాదాన్ని ఇస్తాడని తెలిపే సందేశాలు ఈ గ్రంథంలో వున్నాయి.

జెకర్యా - Zechariah

పరిచయం:

జెకర్యా గ్రంథంలో రెండు ప్రధాన భాగాలున్నాయి. మొదటిది, 1 -8 అధ్యాయాలు క్రీ. పూ.520 - క్రీ. పూ.518 మధ్య కాలంలో జెకర్యా యెరుషలేము పునరుద్ధరణ గురించి దేవుని ప్రజల పవిత్రికరుణ గురించి దర్శనాల ద్వారా తెలిపిన ప్రవచనాల ద్వారా తెలిపిన ప్రవచనాలను తెలియజేస్తాయి: రెండవది 9 - 14 అధ్యాయాలు రాబోయే రక్షకుని గురించి అంతిమ తీర్పు గురించి వివరిస్తాయి.

మలాకీ - Malachi

పరిచయం:

మలాకీ గ్రంథం యెరుషలేము దేవాలయ పునర్నిర్మాణం తర్వాత క్రీస్తు పూర్వం అయిదవ శతాబ్దంనాటిది కావచ్చు. ప్రవక్త ప్రజాజీవనంలో కట్టుబాట్లు లేవని అవినీతి పెల్లుబుకుతోందని దైవారాధనలో యధార్ధత లేదని చేబూతు దేవుని ప్రజలు వారి యాజకులు దేవుడు తమతో చేసిన నిబంధనను పునరూద్ధరించుకొని ఆయన పట్ల భయభక్తులు కలిగి జీవించాలని కోరుతున్నాడు. దేవుడు తన మార్గాన్ని సరళం చేయడానికి తన నిబంధనను ప్రకటించడానికి ముందుగా తన దూతను పంపుతాడనే నిరీక్షణాస్పద సందేశంతో పాత నిబంధనలోని చివరి గ్రంధం ముగుస్తోంది.